ఈమధ్య రెండు ఓటీటీ కంపెనీలపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ కు పెడుతూ వంద రూపాయల అదనపు రుసుము విధించింది జీ5 సంస్థ. ఇక కేజీఎఫ్2 సినిమాను స్ట్రీమింగ్ కు పెడుతూ 200 రూపాయల్ని ఎక్స్ ట్రా ఛార్జ్ గా విధించింది అమెజాన్ ప్రైమ్ సంస్థ.
ఆల్రెడీ సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ, ఇలా కొత్త సినిమా కోసం ఎక్స్ ట్రా రేటు ఫిక్స్ చేయడంపై ఈ రెండు ఓటీటీ వేదికలపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ నడిచింది.
ఈ ట్రోలింగ్ తో జీ5 సంస్థ వెనక్కి తగ్గింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు అదనపు రుసుము విధించే విధానం (పే-పర్-వ్యూ) నుంచి వెనక్కి తగ్గింది. జీ5 సబ్ స్క్రిప్షన్ తీసుకున్న చందాదారులంతా ఆర్ఆర్ఆర్ సినిమాను ఉచితంగా చూడొచ్చని ప్రకటించింది. ఈరోజు అర్థరాత్రి నుంచి జీ5 ఓటీటీలో ఆర్ఆర్ఆర్ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది. 4కె విజువల్ క్లారిటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.
జీ5 వెనక్కి తగ్గడంతో, ఇప్పుడు అందరి దృష్టి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ పై పడింది. ఈ ఓటీటీ కంపెనీ, కేజీఎఫ్2 కోసం 200 రూపాయల అదనపు రుసుము విధించింది. ఇది ఎలాంటి ఫలితాల్ని ఇచ్చిందనేది ఆ కంపెనీకి మాత్రమే తెలుస్తుంది. జీ5 చూపించిన చొరవతో, అమెజాన్ ప్రైమ్ కూడా ఎక్స్ ట్రా రుసుము లేకుండానే కేజీఎఫ్2ను అందుబాటులోకి తెస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.