ఉక్రెయిన్ శాంతి పరిష్కారం కోసం టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ చేసిన సూచనలు వివాదాస్పదం అవుతున్నాయి. దీన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన చేసిన ట్వీట్లపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
అసలు ఏం జరిగిందంటే… ఉక్రెయిన్ యుద్దం ఎలన్ మస్క్ తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆ దేశంలో శాంతి నెలకొనాలంటే ఏం చేయాలో పరిష్కార మార్గం చూపుతూ ఓ ట్వీట్ చేశారు. అది కాస్త వివాదాస్పదం కావడంతో ఆయనపై ఆదేశ ప్రజలు మండిపడుతున్నారు.
ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాల్లో రష్యా రెఫరెండం నిర్వహించింది. అయితే ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో ఆయా వివాదాస్పద ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలని మస్క్ సూచించారు. అక్కడి ప్రజలు చెప్పే తీర్పును ఇరు దేశాలు తప్పకుండా పాటించాలని ట్వీట్ చేశారు.
క్రిమియా ప్రాంతాన్ని రష్యాలోని భూభాగంగా అధికారికంగా గుర్తించాలన్నారు. ఆ ప్రాంతానికి నీటి సరఫరాను పునరుద్దరించాలని పేర్కొన్నారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఫైర్ అయ్యారు. ఈ రెండింటిలో మీరు దేన్ని ఇష్టపడుతారని జెలెన్‌స్కీ ప్రశ్నించారు. మీరు ఉక్రెయిన్, రష్యా రెండింటిలో దేనికి మద్దతు ఇస్తారంటూ ప్రశ్నలు వేశారు.