ఉక్రెయిన్ ను అష్టదిగ్బంధం చేసి ముప్పేట దాడి చేస్తున్న రష్యా సేనలు.. పరిస్ధితులకు అనుగుణంగా యుద్ధ తంత్రాన్ని మారుస్తున్నాయి. ఇప్పటి వరకు రాజధాని కీవ్ సహా కీలక నగరాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా విరుచుకుపడుతున్న రష్యా.. తాజాగా దాని పొరుగు దేశాలకు హెచ్చరికలు పంపే లక్ష్యంతో దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ కు ఆయుధాల పరంగా సాయం చేసే దేశాలు కూడా తమ లక్ష్యమే అని రష్యా ఇప్పటికే హెచ్చరించింది. ఆదివారం ఆ దిశగానే పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాటోలో సభ్యత్వం కోసం యత్నించవద్దని ఉక్రెయిన్ ను హెచ్చరిస్తున్న రష్యా.. దానిలో సభ్యదేశమైన పోలండ్ కు సమీపంలో బీభత్సం సృష్టించింది.
పాశ్చాత్య దేశాల నుంచి ఉక్రెయిన్ కు సాయం అందడంలో పోలండ్ కీలక పాత్ర పోషిస్తోంది. పోలండ్ కు సమీపంలోని లివీవ్ నగరంలోని యురోపియన్ అంతర్జాతీయ శాంతి పరిరక్షక, భద్రత కేంద్రంపై రష్యా సేనలు వైమానిక దాడులు జరిపాయి. ఈ ఘటనలో 35 మంది చనిపోగా.. మరో 134 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తున్న నాటో కూటమి దేశాలకు హెచ్చరికలు పంపేందుకే రష్యా ఈ దాడుల రూపంలో సంకేతాలు పంపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో రష్యా బాంబుల వర్షం కురిపించిన నేపథ్యంలో.. తమ దేశంపై నో ఫ్లైజోన్ ప్రకటించాలని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కు మరోమారు విజ్ఞప్తి చేశారు జెలెన్స్కీ. లేకపోతే రష్యా రాకెట్లు నాటో భూభాగం పైనా పడతాయని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యాను నిలవరించకుంటే.. పశ్చిమ దేశాలతో యుద్ధానికి దిగేందుకు రష్యా సిద్ధం అవుతోందని.. నార్డ్ స్ట్రీమ్2 ను ఒక ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
Advertisements
ఐరాపా సమాఖ్యలో ఉక్రెయిన్ సభ్యత్వంపై చర్చల ప్రక్రియకు ప్రాధాన్యమిస్తామని ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకెల్ చెప్పినట్లు తెలిపారు జెలెన్స్కీ. ఉక్రెయిన్ కు ఆర్థిక సాయం, రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు. అయితే.. ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో మరోమారు శాంతి చర్చలకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు చేపట్టనున్నట్లు స్పుత్నిక్ మీడియా తెలిపింది.