తమ డెలివరీ బాయ్స్ చనిపోతే ఏం చేయాలనే దానిపై జోమాటో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేసింది. గత వారం మరణించిన డెలివరీ బాయ్ కి సంబంధించి ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. 38 ఏళ్ల డెలివరీ ఎగ్జిక్యూటివ్, సలీల్ త్రిపాఠి జనవరి 8 రాత్రి వాయువ్య ఢిల్లీలోని రోహిణిలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసు వాహనం ఢీకొట్టిన ఘటనలో అతను తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనలో నిందితుడు జిలే సింగ్ అనే కానిస్టేబుల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇక ఇదిలా ఉంటే ఈ ఘటన సంచలనం కావడంతో సలీల్ భార్యకు పోలీసులు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ లు చేయగా… జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. అతని కుటుంబానికి పది లక్షల బీమా అందించడమే కాకుండా ఆస్పత్రి ఖర్చు, అంత్యక్రియల ఖర్చులు అన్నీ భరించింది. అలాగే అతని కుమారుడి విద్యకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తామని ప్రకటన చేసింది. ఇక జోమాటో ఉద్యోగులు అందరూ కలిసి అతని కుటుంబానికి దాదాపు 12 లక్షల విరాళం ఇచ్చారు.
జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ గురువారం ట్విట్టర్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన నుంచి మరో ప్రకటన కూడా వచ్చింది. డెలివరి బాయ్స్ ఎవరైనా సరే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే కచ్చితంగా తాము పది లక్షల బీమా అందిస్తామని పేర్కొన్నారు. అవసరమైతే మరింత సహాయం చేస్తామని ఆయన ప్రకటించారు. ఇక సలీల్ భార్యకు జోమాటో లో ఉద్యోగం కూడా ఇచ్చారు.