చిరంజీవి సినిమాల్లో అందరికీ సుపరిచితుడైన తేజ సజ్జ హీరోగా వచ్చిన సినిమా జాంబీ రెడ్డి. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని జాంబీ జానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. అ, కల్కి వంటి సినిమాలతో మెప్పించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమా స్టోరీ ఏంటంటే…?
కరోనా లాక్ డౌన్ సమయంలో… అవేవీ పట్టించుకోకుండా హీరో గ్యాంగ్ తన మిత్రుడి పెళ్లి కోసం రాయలసీమ వెళ్లాలనుకోవటం, అక్కడ ఒక్కొక్కరుగా అందరూ జాంబీలుగా మారిపోవటం, ఐదుగురు మినహా జాంబీలుగా మారిపోయిన ఆ ఊరు వాళ్లను మళ్లీ మాములుగా ఎలా మారుస్తారు అన్న అంశం చుట్టూ కథ తిరుగుతుంది.
సినిమా ఎలా ఉందంటే…?
ప్రధాని నరేంద్రమోడీ కరోనా లాక్ డౌన్ ప్రకటనతో మొదలైన సినిమా… మొదట్లో మమ అనిపించేలా నడుస్తుంది. జాంబీని కాస్త లేటుగా ఎంటర్ చేస్తారు. అయితే, ఇంటర్వెల్ కు ముందు పీక్స్ కు తీసుకెళ్లారు. ఇంటర్వెల్ ముందు సీన్ అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ప్రేక్షకుల్లో నెలకొంటుంది. ఇక సెకండ్ ఆఫ్ మాత్రం సినిమాకు ప్రాణంగా ఉంది. సెకండ్ ఆఫ్ ఆద్యాంతం సినిమాను రక్తికట్టిస్తుంది. ఇక మధ్య మధ్యలో గెటప్ శ్రీను-అన్నపూర్ణమ్మల మధ్య కామెడీ బాగా పండింది. తేజ సజ్జ తన కెరీర్ ను మలుపుతిప్పే సినిమా అనే మాటలు నిజం కాబోతున్నాయి. క్లైమాక్స్ ఇంకాస్త బాగుండాల్సింది అని అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ స్టార్టింగ్ పై ఇంకాస్త దృష్టి పెడితే మరో రేంజ్ లో ఉండే సినిమా అని మాత్రం అనిపిస్తుంది. ఇక సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, జాంబీలను చూపించిన తీరు, కెమెరా-గ్రాఫిక్స్ అన్నీ అద్భుతంగా సరిపోయాయని చెప్పుకోవచ్చు.