జమ్మూ కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో భద్రతాదళాలకు, టెర్రరిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో జవాన్ల ‘అసాల్ట్’ శునకం తీవ్రంగా గాయపడింది. ‘జూమ్’ అనే ఈ జాగిలం ఎంతో శిక్షణ పొందిందని, ఉగ్రవాదుల జాడను పసిగట్టి వారిని పట్టుకోవడంలో తమకు సహకరిస్తుందని సైనికవర్గాలు తెలిపాయి. నిన్న ఈ జిల్లాలోని ఓ ఇంట్లో దాక్కున్న టెర్రరిస్టులను పట్టుకునేందుకు ఈ కుక్కను పంపగా టెర్రరిస్టుల గన్ షాట్లు తగిలి గాయపడిందని ఈ వర్గాలు వెల్లడించాయి.
రెండు గన్ షాట్లలో గాయపడినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఉగ్రవాదులపై దాడికి దూసుకుపోయిందని, దీంతో తాము కాల్పులు జరిపి ఇద్దరిని మట్టుబెట్టగలిగామని భద్రతాదళాలు తెలిపాయి. జూమ్ ని శ్రీనగర్ లోని సైనిక వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న ఈ మూగజీవి త్వరగా కోలుకోవాలని సైనికాధికారులు కోరుతున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో పలువురు జవాన్లు గాయపడ్డారు. జూమ్ కి ఇచ్చిన కఠిన శిక్షణ కారణంగా అది కశ్మీర్ లో నిర్వహించిన పలు ఆపరేషన్లలో తన సత్తా చూపిందని, సైన్యానికి జూమ్ ఓ ఎసెట్ అని అధికారులు వ్యాఖ్యానించారు.
అనంత్ నాగ్ జిల్లాలోని టాంగ్ పావా ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం అందడంతో భద్రతాదళాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాదులను పాక్ ప్రేరేపిత లష్కరే-తోయిబా సంస్థకు చెందినవారిగా భావిస్తున్నారు.