హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యలో తన ప్రమేయం ఉందంటూ మీడియాలో వస్తున్న కథనాలపై నిందతుల్లో ఒకరైన బిట్టు శ్రీనివాస్ మేనమామ, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు స్పందించారు. ఈ కేసులో పోలీసులు ఇన్విస్టిగేషన్ చేస్తున్నారా లేక మీడియా ఇన్వెస్టిగేషన్ చేస్తోందా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. టీవీలు, పేపర్ల తీరును చూస్తోంటే అసహ్యమేస్తోందని మండిపడ్డారు. తనపై ఎందుకు ఇంత కుట్ర.. ఎందుకు ఇంత పగ అంటూ మీడియాను ప్రశ్నించారు. ఇన్విస్టిగేషన్‌లో ఎవరిది తప్పో తేలితే.. వారు జైలుకు వెళ్తారు కదా అని అన్నారు.
తన దగ్గర డబ్బు లేదని, తనకు మీడియాను కొనుగోలు శక్తి లేకపోవడం వల్లే దుష్ప్రచారం చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. తాను ఎవరి అపాయింట్మెంట్ కోరలేదని .. తనను హైదరాబాద్‌కు రావాలని ఎవరూ పిలవలేదని అన్నారు తాను వజ్రాన్ని అని.. మోసగాడిని కాదని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు.
మంథనిలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు ఈ అంశంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్, కేటీఆర్ అపాయింట్మెంట్ అడిగానన్న వార్తలు అవాస్తవమని, ఇదంతా శ్రీధర్ బాబు కుట్రలన్నాడు. వీటిని తిప్పికొడతానని… కేసు విచారణ పూర్తయ్యాక హైదరాబాద్ లోనే ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలను వెల్లడిస్తానన్నారు..