ప్రస్తుతం అడ్వెంచర్ టూరిజంపై పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. రివర్ రాఫ్టింగ్, కేవింగ్, డైవింగ్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, విండ్ సర్ఫింగ్, జిప్‌లైన్ ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, తదితర సహస క్రీడలపై యువత ఉత్సాహం కనబరుస్తున్నారు. వీటి కోసం ఉరకలు వేస్తూ పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు. అయితే, వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సార్లు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువే ఉంటుంది. తాజాగా బిహార్ రాష్ట్రంలో అలాంటి ఘటననే చోటుచేసుకుంది.
నలంద జిల్లా రాజ్‌గీర్‌లో ఓ మహిళకు పెను ప్రమాదం తప్పింది. జిప్‌లైన్ ట్రెక్కింగ్ చేస్తున్న ఆమె 1000 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయింది. చాలాసేపు ఆమె అలానే బిక్కుబిక్కుమంటూ గడపగా.. కింద ఉన్నవారు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు స్థానిక అధికారులు రంగంలోకి దిగి.. ఆమెను రక్షించారు.
నేచర్ సఫారీ పార్క్‌లో సదరు మహిళ జిప్‌లైన్ ట్రెక్కింగ్ భాగంగా ఒక స్తంభం నుంచి మరొక స్తంభం వరకు దూసుకొచ్చింది. అయితే, అక్కడ ఆమెను పక్కకు లాగి కిందకు దింపేందుకు సిబ్బంది ఎవరూ లేరు. దీంతో ఆమె స్తంభాన్ని ఢీకొట్టి మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. రెండు స్తంభాల మధ్యలో చాలా సేపటి వరకు అలానే గాల్లోనే ఉండిపోయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే, ఇలాంటి సాహసలు చేసేప్పుడు సరైనా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు అంటున్నారు. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాలకే ప్రమాదమని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని అంటున్నారు.